Patna High Court On Reservation : పట్నా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బిహార్‌లో 65 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు కీలక తీర్పు వెలువరించింది. గతేడాది బిహార్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 65 శాతానికి పెంచింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పట్నా హైకోర్టు, 65 శాతానికి రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని తాజాగా తీర్పు వెలువరించింది.
బిహార్‌లో కులగణన తర్వాత విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను పెంచుతూ సవరణ బిల్లును తీసుకొచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ, రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనకబడిన, అణగారిన వర్గాల రిజర్వేషన్లు 50 శాతం నుంచి 65 శాతానికి పెరిగాయి. ఆర్థికంగా వెనకబడినవారిని ఉద్దేశించిన 10శాతం రిజర్వేషన్లు కలిపి రిజర్వేషన్లు 75శాతానికి చేరాయి. అయితే, ఈ పెంపుపై కొన్నివర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది.