Minor Liver Donation To Father: కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఓ రైతుకు కాలేయం దానం చేయడానికి అతడి కుమార్తె ముందుకు వచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 42ఏళ్ల శివనారాయణ్ బాథమ్ అనే వ్యక్తి కొంతకాలంగా కాలేయ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో అతడికి కాలేయం దానం చేయడానికి 17ఏళ్ల తన కూతురు ప్రీతి సిద్ధమైంది. అయితే ప్రీతి మైనర్ కావడం వల్ల శివనారాయణ్ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన కూతురు కాలేయాన్ని తీసుకునేందుకు వైద్యులకు అనుమతి ఇవ్వాలని కోరారు.
తన క్లైయింట్ ఆరేళ్లుగా తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్నారని, శివనారాయణ్ తరపు లాయర్ నీలేష్ మనోర్ కోర్టు ముందుంచారు. అతడికి ఐదుగురు కుమార్తెలు ఉండగా పెద్ద కూతురు ప్రీతి కాలేయంలో కొంత భాగాన్ని పొందేందుకు అనుమతివ్వాలని నీలేష్ కోరారు. శివనారాయణ్ ఆరోగ్య పరిస్థితిపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరుతూ, పిటిషన్ విచారించిన జస్టిస్ వినోద్‌కుమార్ విచారణను జూన్ 20వ తేదీకి వాయిదా వేశారు.