Mallikarjun Kharge : ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ను ప్రవేశపెట్టాలన్న నిర్ణయం ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎస్సీల వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్న క్రీమీలేయర్ అన్న భాగాన్ని తొలగించడానికి కేంద్రం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. క్రీమీలేయర్‌ను ప్రవేశపెట్టి ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అంటరానితనం ఉన్నంతవరకు రిజర్వేషన్లు ఉండాలని అందుకు కోసం తాము పోరాడతామని చెప్పారు.
బీజేపీ రిజర్వేషన్లను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఖర్గే ఆరోపించారు. క్రీమీలేయర్ పేరుతో ఎస్సీ, ఎస్టీలను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు నిర్ణయం ఆశ్చర్యంగా అనిపించిందని తెలిపారు. ప్రజలంతా ఐక్యంగా ఉండి సుప్రీంకోర్టు తీర్పుకు తగ్గిన గుర్తింపు రాకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఎస్సీల వర్గీకరణకు సంబంధించిన ఇతర అంశాలపై పార్టీ నాయకులతో చర్చిస్తున్నామని ఖర్గే వెల్లడించారు.