Karnataka Bus Ticket Price : కర్ణాటకలో బస్సు టికెట్ ఛార్జీల్ని పెంచేందుకు కేఎస్ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. తమ సంస్థ మనుగడ సాగించాలంటే ప్రభుత్వ బస్సుల్లో ఛార్జీల పెంపు తప్పనిసరి అని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ ఛైర్మన్ ఎస్‌ఆర్ శ్రీనివాస్ తెలిపారు. 15- 20శాతం మేర ఛార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు ఆయన పేర్కొన్నారు. టికెట్ ధరల్ని పెంచాలో, వద్దో సీఎం సిద్ధరామయ్య విచక్షణపై ఆధారపడి ఉంటుందన్నారు.
ప్రస్తుతం 'శక్తి' పథకం కింద బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెరిగితే పురుష ప్రయాణికులపై భారం పడతుందా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు శ్రీనివాస్ ఈ విధంగా స్పందించారు. కేవలం వారిపైనే భారం వేసే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. మహిళ బస్సు ప్రయాణానికి అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు.