Jammu kashmir Encounter : జమ్ముకశ్మీర్‌లోని కిస్త్‌వాడ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. మరో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడినట్లు భద్రతాధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల కదలికలపై అందిన సమాచారంతో ఛాత్రూ బెల్ట్‌లోని నైగ్దాం ప్రాంతంలో సైనికులు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. ఈ సందర్భంగా చెలరేగిన ఎదురు కాల్పుల్లో నలుగురు సైనికులు గాయపడ్డారని వెల్లడించారు. వారిలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ నాయబ్ సుబేదార్ విపన్ కుమార్, సిపాయి అర్వింద్ సింగ్ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని భద్రతాధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా బారాముల్లా జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో చక్ తాపర్ క్రీరీ ప్రాంతంలో పోలీసులు, భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. మరింత మంది ముష్కరులు ఉండొచ్చన్న అనుమానంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు