CM Salary Jharkhand Hike : ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు ఎమ్మెల్యేల జీతాలను 50 శాతం వరకు పెంచేందుకు ఝార్ఖండ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యేల జీతం గరిష్ఠంగా 50 శాతం పెరగనుంది. ముఖ్యమంత్రి, మంత్రుల శాలరీలు 25 శాతం, 31 శాతం పెరగనున్నాయి. సీఎం చంపయీ సోరెన్ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జీతాల పెంపునకు ఆమోదం లభించింది. ఈ విషయాన్ని కేబినెట్ సెక్రటీరీ వందనా దాడెల్ తెలిపారు.
సీఎం జీతం నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్షకు, మంత్రుల జీతాలు రూ.65 వేల నుంచి రూ.85 వేలకు, శాసనసభ్యుల జీతాలు రూ.40 వేల నుంచి రూ.60 వేలకు, స్పీకర్ జీతం నెలకు రూ.78 వేల నుంచి రూ.98 వేలకు, ప్రతిపక్ష నేత రూ.65 వేల నుంచి రూ.85 వేలకు, చీఫ్ విప్ రూ.55 వేల నుంచి రూ.75 వేలకు పెరగనుంది. జీతంతోపాటు అలవెన్సులు, ఇతర ప్రోత్సాహకాలు కూడా పెరగనున్నాయి.