పులివర్తి నాని ఫ్లెక్సీల తొలగింపు- టీడీపీ, వైసీపీ కార్యకర్తల వాగ్వాదం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 7:26 PM IST
YSRCP Leaders Removed TDP Flexi: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుచానూరు పంచాయతీలో వైసీపీ నేతలు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని తిరుచానూరులో పర్యటిస్తుండగా తెలుగుదేశం ఫ్లెక్సీలను అధికార వైసీపీ పార్టీ నాయకులు తొలగించారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలకు సమాధానం చెప్పలేక వైసీపీ నాయకులు అక్కడి నుంచి జారుకున్నారు. తిరుచానూరు వైసీపీ సర్పంచ్ రామచంద్రారెడ్డి పంచాయతీ సిబ్బందిని పంపి బ్యానర్లు తొలగించాల్సిందిగా ఆదేశించారని పులివర్తి నాని ఆరోపించారు.
దీంతో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పులివర్తి నాని టీడీపీ కార్యకర్తలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికలలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ప్రజలను మరింతగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు కనిపించకుండా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీకి ఫ్లెక్సీలకు, లైటింగ్ బోర్డులకు అనుమతులు ఇస్తూ టీడీపీ ఫ్లెక్సీలకు మాత్రం అనుమతులను నిరాకరిస్తూ ఏకపక్ష ధోరణిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీనంతటికీ త్వరలోనే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.