రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నేతలు - ఈనాడు విలేకరిపై దాడి
🎬 Watch Now: Feature Video
YSRCP Leaders Attack on Eenadu Journalist in Panladu District : అధికార పార్టీ నేతలను ప్రశ్నించినా, వారి అక్రమాలను ప్రజలకు తెలియజేయాలని ప్రయత్నించినా ఇంకా ఏమైనా ఉంటుందా! వారిపై దాడి చేయడం, అవకాశం ఉంటే వారి చంపడానికి కూడా వైసీపీ నేతలు వెనకడుగు వేయడం లేదు. ఇలాంటి సంఘటనే పల్నాడు జిల్లాలో జరిగింది. వైసీపీ నేతల ఇసుక అక్రమ తవ్వకాల ఫొటోలు, వీడియోలు తీసినందుకు ఈనాడు విలేకరిపై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు.
అమరావతిలో ఈనాడు విలేకరిగా విధులు నిర్వర్తిస్తున్న పరమేశ్వరరావుపై ఎమ్మెల్యే నంబూరి శంకరరావు అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు. స్థానిక మల్లాది ఇసుక రీచ్‌లో అక్రమంగా తవ్వకాలు జరుగుతున్న విషయం తెలిసి పరమేశ్వరరావు అక్కడకు వెళ్లారు. తవ్వకాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసుకుని బయలు దేరే సమయంలో 8 మంది వైసీపీ నేతలు అతనిపై దాడికి దిగారు.
కలెక్టర్ ఆదేశాలనే ఖాతరు చేయలేదు అంటూ పరమేశ్వరరావుపై వైసీపీ నేతలు పిడిగుద్దుల వర్షం కురిపించారు. అతని వద్ద ఫోన్ లాక్కుని పెద్ద పెద్ద రాళ్లతో చంపేయడానికి సిద్ధపడ్డారు. పరమేశ్వరరావు ఇసుక రీచ్ నుంచి బయటపడి అమరావతికి చేరుకున్నారు. అక్కడ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరమేశ్వరరావుపై దాడి చేసిన వారిలో వెంపా శ్రీను, తులసి తిరుపతిరావు, బవిరిశెట్టి నాగేశ్వరరావు ఉన్నారు.
అమరావతి ఈనాడు విలేకరి పరమేశ్వరరావుపై వైకాపా నేతల దాడి దుర్మార్గమని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. అక్రమ ఇసుక తవ్వకాల ఫొటోలు తీస్తే దాడులు చేస్తారా అని మండిపడ్డారు. సీఎం జగన్ పాలనలో విలేకరులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని విమర్శించారు. ఎన్జీటీ ఆదేశాలు సైతం లెక్క చేయకుండా వైఎస్సార్సీపీ నేతలు ఇసుక దోచేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలకు అడ్డు లేకుండా పోయిందని తెదేపా నేత కొమ్మాలపాటి శ్రీధర్ దుయ్యబట్టారు. ఈనాడు విలేకరిపై వైకాపా రౌడీ మూకల దాడిని శ్రీధర్ ఖండించారు.