రుషికొండ రాజకోట రహస్యమిదే- అత్యంత విలాసవంతమైన నిర్మాణాలు - Rushikonda Buildings Secrets
🎬 Watch Now: Feature Video
Visakha Rushikonda Buildings Secrets: విశాఖలో వైఎస్సార్సీపీ పాలనలో నిర్మించిన రుషికొండ భవనాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూటమి పార్టీల శ్రేణులతో కలిసి పరిశీలించారు. రూ.450 కోట్లు కుమ్మరించి ఈ భవనాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించింది. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పూర్తి చేసిన ఆ నిర్మాణం దేనికోసమో ఆ శాఖ అధికారులు కాదు కదా వాటిని ప్రారంభించిన మంత్రులు కూడా చెప్పలేదు. దీంతో ఇదేమైనా 'రాజకోట రహస్యమా' అని విమర్శలు వినిపించాయి. వేంగి ఎ, వేంగి బి, కళింగ, గజపతి, విజయనగరం ఏ, బీ, సీ ఇలా మొత్తం ఏడు బ్లాకుల్లో రిసెప్షన్, రెస్టారెంట్లు, బ్యాంకెట్‌హాళ్లు, గెస్ట్ రూములు, ప్రీమియం విల్లా సూట్స్, స్పా, ఇండోర్ గేమ్స్, ఫిట్‌నెస్ సెంటర్, బ్యాక్ ఆఫీస్ వంటివి అభివృద్ధి చేశారు.
రుషికొండపై పర్యాటక రిసార్టు నిర్మాణం పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు. నిక్షేపంగా ఉన్న 'హరితా హిల్ రిసార్టు' భవనాలు పాతవైపోయాయని కూల్చేశారు. కొండను అక్రమంగా తవ్వేస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్నారని నిపుణులు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఎంత గగ్గోలు పెట్టినా వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు కొండను తవ్వేసి బోడిగుండు చేసేశారు. న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టినా పట్టించుకోకుండా ముందుకెళ్లారు. నిపుణుల కమిటీ రుషికొండపై సర్వే చేపట్టి పలు ఉల్లంఘనలు జరిగాయని తేల్చినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎంతో హడావుడి చేసి, ఎంత మంది అడ్డుచెప్పినా పెడచెవిన పెట్టి, వాయువేగంతో గత వైఎస్సార్సీపీ సర్కార్ నిర్మాణం పూర్తి చేసింది.