జగన్కు ఓటమి భయం - వాలంటీర్లతో ప్రజలకు ప్రలోభాలు: టీడీపీ నేత షరీఫ్ - TDP Leader Sharif on Volunteers
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 14, 2024, 9:05 PM IST
TDP Leader Sharif on Volunteers: ఓటమి భయంతోనే జగన్ రెడ్డి వాలంటీర్లతో ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని టీడీపీ నేత ఎం.ఏ షరీఫ్ ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిపేస్తారంటూ వైసీపీ దుర్మార్గపు ప్రచారాన్ని చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన వాలంటీర్లు అధికార పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు. ప్రజాధనాన్ని గౌరవ వేతనంగా ఇస్తూ వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలుగా వాడుకుంటారా? అని షరీఫ్ నిలదీశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం వాలంటీర్లను వాడుకుని జగన్ రెడ్డి అనేక ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. వైసీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. 40 రోజుల్లో వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోబోతోందన్న ఆయన, వాలంటీర్లు చెబుతున్నట్లు సంక్షేమ పథకాలు రద్దవుతాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అరాచక, అప్రజాస్వామిక, నియంత ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి టీడీపీ-జనసేన పార్టీలతో కలిసి రావాలని షరీఫ్ ప్రజలను కోరారు.