'వైసీపీ పాలనంతా అప్పులమయమే - అప్పు చేస్తే గానీ ప్రభుత్వం నడవని పరిస్థితి' - TDP Leaders Fire on CM Jagan
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 5:18 PM IST
TDP Leader Nilayapalem Vijaykumar on AP Debts: వైసీపీ ఐదేళ్ల పాలనంతా అప్పులమయమే అని తెలుగుదేశం నేత నీలాయపాలెం విజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. రోజూ చేస్తున్న సగటు 257 కోట్ల రూపాయలు అప్పులో రూ. 80 కోట్లు వడ్డీ కట్టేందుకే సరిపోతుందని విమర్శించారు. తెచ్చుకున్న అప్పులో రూ.80 కోట్లు వడ్డీకే పోతుంటే, ఇక మనం పెట్టుబడుల (Investments) మీద పెట్టే ఖర్చు ఏముంటుందని ప్రశ్నించారు. పెట్టుబడులపై ఖర్చులో దేశంలోనే మనది 15వ స్థానం ఉందన్న ఆయన రాష్ట్రం ఇచ్చిన బ్యాంకు గ్యారెంటీ (Bank Guarantee)లో మాత్రం ప్రథమ స్థానంలో ఉందని ధ్వజమెత్తారు.
"ఐదేళ్ల వైసీపీ పాలన అంతా అప్పులమయమే. రోజుకు రూ.257 కోట్లు అప్పు చేయడం, రూ.80 కోట్ల వడ్డీ కట్టడమే. ఎన్నికలు వచ్చేస్తున్నాయి, అప్పులు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం ఎప్పుడో గాలికి ఎగిరిపోయింది. కాగ్ డిసెంబర్ రిపోర్టు ప్రకారం ప్రభుత్వం రోజుకు పెట్టే ఖర్చు రూ.698 కోట్లు. రోజుకు సొంతంగా సంపాదించేది కేవలం రూ.264 కోట్లు. సంపాదన కూడా ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసే పన్నులే. అప్పు పరిమితి రూ.30,275 కోట్లు.. చేసిన అప్పు రూ.69,500 కోట్లు. ఇంత అప్పు అంటే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి అధిగమించినట్లు కాదా?. ప్రతి నెలా 37 శాతం అప్పు చేస్తేగానీ ప్రభుత్వ బండి నడవదు." - నీలాయపాలెం విజయ్‌కుమార్, తెలుగుదేశం అధికార ప్రతినిధి