వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తోంది: అచ్చెన్నాయుడు - టీడీపీ నేత అచ్చెన్నాయుడు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2024, 12:17 PM IST
TDP Leader Atchannaidu Fires on YSRCP Government: వెంటిలేటర్ మీద ఉన్న వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్య, మహిళల భద్రతపై టీడీపీ శాసనసభా పక్షం ఆందోళన చేసింది. 'ఉపాధి లేక నిరుద్యోగుల ఆకలి కేకలు, రక్షణ లేక మహిళల ఆర్తనాదాలు' అంటూ బ్యానర్ ప్రదర్శన చేశారు. ప్రతీ జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీ ఏమైందని ఆయన నిలదీశారు.
వైసీపీ ప్రభుత్వం గత 5సంవత్సరాలుగా చేసిన ప్రతీ చట్టం కూడా రాష్ట్ర వినాశనం కోసమేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం, మహిళల భద్రత వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్నాయని పేర్కొన్నారు. 27వేల ఖాళీలతో మెగా డీఎస్సీ ఇస్తామని యువతను మోసగించారని దుయ్యబట్టారు. 5ఏళ్ల ప్రజావ్యతిరేక విధానాలపై రూపొందించిన పుస్తకాన్ని అసెంబ్లీ ముందే తగలపెడతామని తెలిపారు. శాసనసభను సైతం ఐదు సంవత్సరాలుగా వైసీపీ కార్యాలయంలా ఉపయోగించుకున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రూపంలో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతోందని అచ్చెన్న ఎద్దేవా చేశారు. కౌరవ సభను మళ్లీ గౌరవ సభగా మారుస్తామని స్పష్టం చేశారు.