ఇసుక దోపిడీని అరికట్టలేని ప్రభుత్వం దిగిపోవాలి: టీడీపీ, జనసేన నేతలు - అక్రమ ఇసుక తవ్వకాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 25, 2024, 10:25 AM IST
TDP-Janasena Leaders Concern To Sand Mining: టీడీపీ అధిష్ఠానం పిలుపు మేరకు ఇసుక దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో పలుచోట్ల తెలుగుదేశం, జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. కృష్ణా జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను నిరసిస్తూ తోట్లవల్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలను ప్రభుత్వం వెంటనే అరికట్టి ఇసుక దొంగలను అరెస్టు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఇసుక దోపిడీని అరికట్టలేని ప్రభుత్వం దిగిపోవాలని నినాదాలు చేశారు. జగనాసురుడు అంటే ఇసుకాసురుడు అంటూ నినాదాలు చేశారు.
గుంటూరు జిల్లా ఉద్ధండరాయునిపాలెంలో ఇసుక తరలింపుపై టీడీపీ, జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తుళ్లూరు తహసీల్దార్ సుధీర్, సీఐ సుభానీలకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు వేల కోట్ల రూపాయల ఇసుకను తవ్వి అమ్ముకున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు చేస్తున్న ఇసుక మాఫియాను అధికారులు అడ్డుకుని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వందల సంఖ్యలో లారీలు ఇసుకను తరలిస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నేతలు మండిపడ్డారు.