టీడీపీ-జనసేన మొదటి జాబితాకి తాడేపల్లి ప్యాలెస్ కంపించింది: బోండా ఉమా
🎬 Watch Now: Feature Video
TDP Bonda Uma Fires on CM Jagan: తెలుగుదేశం-జనసేన మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించిందని, తుది జాబితాతో వైసీపీ మైండ్ బ్లాంక్ తప్పదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. టీడీపీ-జనసేన 118 స్థానాలు ఒకేసారి ప్రకటించిందిన్నారు. అంతా సాఫీగా జరిగిందని, వైసీపీలాగా కుదుపులేమీ లేవని వెల్లడించారు. 80 సీట్లు ప్రకటించడానికే వైసీపీ కల్లోలమై అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి జారిపోయారని తెలిపారు. జగన్ ఫ్రస్టేషన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటనతో వైసీపీ అగ్రనేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. దీంతో సజ్జల తెరమీదకు వచ్చి అవాకులు చవాకులు పేలారని మండిపడ్డారు.
పవన్ కల్యాణ్ సీటు ప్రకటించలేదన్న సజ్జల, జగన్ రెడ్డి ఏ సీటు నుంచి పోటీ చేస్తారో ఇంకా ఎందుకు ప్రకటించలేదో ముందు చెప్పాలని ప్రశ్నించారు. మా పొత్తులు, మా సీట్ల గురించి ఓవర్గా రియాక్ట్ అవుతున్నారంటే మీరు భయపడుతున్నట్టే కదా అని ధ్వజమెత్తారు. ఎగిరెగిరి పడుతున్న అంబటి రాంబాబుకు అసలు సీటు ఉందో లేదో చెప్పాలన్నారు. ఆయన సీటుకే గ్యారెంటీ లేదు. మళ్లీ టీడీపీ-జనసేన పొత్తుపై మాట్లాడతారా అని దుయ్యబట్టారు. జగన్ను నమ్మి ఎక్కువ నోరు పారేసుకోకండని, తాను చేసిన తప్పులకు బదిలీలు అని ఇప్పటికే 77 మందిని బలి చేశారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఘన విజయం సాధించి జగన్ దోపిడీ పాలనకు స్వస్తి పలకడం ఖాయమని స్పష్టం చేశారు.