వైసీపీ సిద్ధం సభలకు బస్సుల తరలింపుపై సీఎస్‌కు అచ్చెన్నాయుడు లేఖ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 8:13 PM IST
TDP Atchannaidu Letter to CS Jawahar Reddy: వైసీపీ సిద్దం సభలకు ఆర్టీసీ బస్సులు తరలించడంపై సీఎస్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. గత కొన్ని వారాలుగా వైసీపీ నిర్వహిస్తున్న సిద్దం సభలకు ఆర్టీలు బస్సులు తరలిస్తున్నారని, ఫిబ్రవరి 18న రాప్తాడులో జరిగిన సిద్దం సభకు దాదాపు 3 వేల ఆర్టీసీ బస్సులు తరలించారని మండిపడ్డారు. జనవరి 27 న భీమిలీ సభకు వెయ్యి బస్సులు దారిమళ్లించారని దుయ్యబట్టారు. ఫిబ్రవరి 3 న దెందులూరు సభకు 1200 బస్సులు తరలించారని లేఖలో పేర్కొన్నారు. పెద్దఎత్తున ఆర్టీసీ బస్సులు దారిమళ్లించడంతో సామాన్య ప్రజలు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో గంటల తరబడి బస్టాప్‌లలో వేచిచూడాల్సి వస్తోందని మండిపడ్డారు.
విద్యార్థులు తమ క్లాసులకు హాజరుకాలేకపోతున్నారని అచ్చెన్న లేఖలో పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులే కాకుండా, పెద్ద ఎత్తున ప్రైవేటు బస్సులు పార్టీ కార్యక్రమాలకు తరలించడంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీవో అధికారులు అధికారపార్టీతో కుమ్మక్కై ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులకు పరీక్షల సీజన్ కావడంతో స్కూళ్లు, కాలేజీలు నిర్వహిస్తున్న ప్రత్యేక క్లాసులకు హాజరు కాలేకపోతున్నారని వాపోయారు. విద్యార్థులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ బస్సులు అధికారపార్టీ కార్యక్రమాలకు తరలించకుండా ఆదేశాలు జారీచేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ బస్సులు అన్ని పార్టీలకు సమానంగా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.