వేతనాలతో పాటు రూ.20లక్షలు తిరిగివ్వండి- 70 మంది వైద్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు - PG Medical Doctors - PG MEDICAL DOCTORS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 18, 2024, 11:18 AM IST
State Govt Ordered to PG Medical Doctors Refund Salaries : పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, ఐదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారిక సెలవుల్లో ఉన్న 70 మంది వైద్యులకు రూ.20 లక్షలతో పాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రిల్లో వైద్యులుగా పనిచేసే వారు ఇన్ -సర్వీస్ కోటాలో పీజీ వైద్య విద్యను పూర్తిచేసే అవకాశం ఉంది. విద్య అనంతరం ఐదేళ్ల పాటు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రిల్లోనే పనిచేయాలి. లేని పక్షంలో ఆ సమయంలో పొందిన వేతనాలతో పాటు అదనంగా రూ.20 లక్షలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు అంగీకారం తెలుపుతూ బాండ్ పేపరుపై సంతకాలు పెడుతున్నారు.
పీజీ వైద్య విద్యను పూర్తిచేసిన వారిలో కొందరు విధుల్లో చేరిన తర్వాత అర్ధంతరంగా మానేసి వెళ్లిపోతున్నారు. మరికొందరు అసలు విధులకు హాజరు కావడం లేదు. విధులకు హాజరుకావాలని ప్రభుత్వం పలుమార్లు నోటీసులు పంపినా అనధికారికంగా సెలవులో వెళ్లిన వైద్యులు స్పందించలేదు. దీంతో బాండ్ లో పేర్కొన్న విధంగా రూ.20 లక్షలు జూన్ 15 లోగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. చెల్లించాని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ పద్మావతి ఓ ప్రకటనలో తెలిపారు. రేడియాలజీ, ఆంకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఇతర స్పెషాల్టీ వైద్యులు ఈ జాబితాలో ఉన్నారని ఆమె తెలియజేశారు.