ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు రంగం సిద్ధం - ఈ నెలాఖరులోపు ప్రక్రియ పూర్తికి యోచన - Government Employees Transfer - GOVERNMENT EMPLOYEES TRANSFER
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 14, 2024, 7:12 AM IST
Government Employees Transfers : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని కోసమే రెవెన్యూ సదస్సులను సెప్టెంబరు మొదటి వారానికి వాయిదా వేశారు. బదిలీల తేదీలు, మార్గదర్శకాలపై బుధవారం జీఓ వెలువడే అవకాశముంది. ఈసారి కొన్ని ఎంపిక చేసిన ప్రభుత్వ విభాగాల్లోనే బదిలీలు ఉంటాయి. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు, వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఇంజినీరింగ్ ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయాలు తదితర విభాగాల ఉద్యోగుల్ని బదిలీ చేయనున్నారు.
ఉపాధ్యాయులు, వైద్యుల వంటి రోజువారీ పరిపాలనా వ్యవహారాలతో సంబంధం లేని విభాగాల ఉద్యోగులకు బదిలీలు ఉండవు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 2024 జులై 31కి ఒకేచోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల్ని తప్పనిసరిగా బదిలీ చేస్తారు. ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తికాని ఉద్యోగులను పరిపాలనాపరమైన అవసరాలు, వ్యక్తిగత విజ్ఞప్తుల మేరకు బదిలీ చేస్తారు. ఒక ఉద్యోగి ఒక కేంద్రంలో ఎప్పటి నుంచి పని చేస్తున్నారన్నది లెక్కించేందుకు, వివిధ కేడర్లలో అక్కడ పని చేసిన మొత్తం కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.