ఏ కార్యాలయంలోనూ రెవెన్యూ రికార్డులకు భద్రత లేదు: బొప్పరాజు వెంకటేశ్వర్లు - bopparaju venkateswarlu comments
🎬 Watch Now: Feature Video
Bopparaju Venkateswarlu Comments: ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త రెవెన్యూ సదస్సుల్ని విజయవంతం చేస్తామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న ఆదేశాల ప్రకారమే ఫ్రీహోల్డ్ భూములపై తాము క్షేత్రస్థాయిలో పని చేశామని చెప్పారు. ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ ఆపడం మంచిదే అని వ్యాఖ్యానించారు. ఫ్రీహోల్డ్ భూముల లావాదేవీల్లో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవచ్చన్న బొప్పరాజు, అందరిపైనా నిందలు వేయొద్దని కోరారు.
మదనపల్లె భూ దస్త్రాల దహనం కేసులో సీఐడీ ఇంకా విచారణ చేస్తోందన్న ఆయన, దర్యాప్తు పూర్తి కాకుండానే ఉద్యోగులపై నిందలు వేయవద్దన్నారు. సీఐడీ విచారణ పూర్తయ్యాక అప్పుడు నిర్ణయానికి వద్దామని సూచించారు. అదే సమయంలో భూ రికార్డుల భద్రత, అందుకు కావాల్సిన సిబ్బంది కేటాయింపుతో పాటు మౌలికవసతులపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ఏ కార్యాలయంలోనూ పురాతన రికార్డులకు భద్రత లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు, భద్రతకు రికార్డు అసిస్టెంట్ పోస్టులివ్వాలని కోరుతున్నామన్నారు. తహసీల్దార్ కార్యాలయాలకు వాచ్‌మెన్ పోస్టులు భర్తీ చేయలేదని తెలిపారు. ఐఆర్‌సీ, 12వ పీఆర్సీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.