తణుకు టీడీఆర్ బాండ్ల కుంభకోణం - ఆదుకోవాలంటూ బిల్డర్ల ఆవేదన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2024, 7:54 PM IST
Tanuku TDR Bonds Scam: తణుకు టీడీఆర్ బాండ్ల కుంభకోణంతో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను తగ్గించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. తప్పు చేసిన వాళ్లు కన్నా తాము ఎక్కువగా నష్టపోయామన్నారు.
వైఎస్సార్సీపీ పాలనలో తణుకు మున్సిపల్ కమిషనర్ ద్వారా 2021-2022 సంవత్సరంలో కొంతమంది భూ యజమానులకు TDR బాండ్లు జారీ చేశారన్న బిల్డర్లు, వీటిని ప్రభుత్వ అధికారిక పోర్టల్ నుంచి తాము కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే టీడీఆర్ బాండ్ల జారీలో ఉల్లంఘనలు జరిగినట్లు కుంభకోణం బయటకు రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డామన్నారు. దీంతో తామంతా హైకోర్టును ఆశ్రయించామని అన్నారు. తాజాగా అక్టోబర్ 14వ తేదీన టీడీపీ బాండ్లను ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ చర్య కారణంగా చిన్న బిల్డర్లకు భారీ ఆర్థిక నష్టాలను మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాండ్లు కొనుగోలు చేసిన తామంతా తీవ్రంగా నష్టపోతామని వాపోయారు. ఈ విషయంలో అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని, సంక్షోభం నుంచి తమను రక్షించాలని బిల్డర్లు ప్రభుత్వాన్ని కోరారు.