'రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు శిథిలావస్థకు చేరాయి - తక్షణమే మరమ్మతులు చేయాలి' - Rayalaseema Irrigation Society - RAYALASEEMA IRRIGATION SOCIETY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2024, 7:36 PM IST
Rayalaseema Irrigation Society Meeting in Nandyal : రాయలసీమలో శిథిలావస్థకు చేరిన సాగునీటి ప్రాజెక్టులను తక్షణమే మరమ్మతులు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. నంద్యాలలో రాయలసీమ ప్రజాసంఘాల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం ఏ మాత్రం సరికాదని అన్నారు. విభజన చట్టంలో రాయలసీమకు చట్టబద్ధంగా రావాల్సిన సంస్థలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోగా మనకు హక్కుగా ఉన్న నీటిని కూడా జీవో ద్వారా తెలంగాణకు బదిలీ చేస్తుంటే అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ఏం చేస్తోందని ప్రశ్నించారు.
ఇప్పటికైనా వచ్చే ప్రభుత్వాలు మౌనాన్ని వీడి రాయలసీమ అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక ప్యాకేజీని, జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని, కర్నూలులో కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని, కడప ఉక్కు, గుంతకల్లు రైల్వే జోన్ మెుదలైనవి ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఈ హామీలన్నీ నేరవేర్చే వరకు పోరాటం ఆపమని దశరథరామిరెడ్డి స్పష్టం చేశారు.