ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ కేసులో కీలక పరిణామం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 19, 2024, 2:52 PM IST
Prathipati Sarath Case in Vijayawada Court: మాజీ మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పన్ను ఎగవేత, డొల్ల కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు ఆరోపణలపై విజయవాడ మాచవరం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసుపై వాదనలు జరుగుతున్నాయి. గత వారం శరత్‌కు మేజిస్ట్రేట్ కరీముల్లా బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసును సీఐడీ కోర్టుకు బదిలీ చేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం న్యాయాధికారి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది.
ప్రభుత్వ ఉత్తర్వు లేకుండా కేసు బదిలీ సాధ్యం కాదని నిందితుడి తరఫు న్యాయవాది కిలారు బెనర్జీ వాదించారు. జీవో విడుదల చేయాల్సిన అవసరం లేదని, కేసు దర్యాప్తును సీఐడీకి బదిలీ చేయడం ద్వారా ఈ కోర్టు పరిధి నుంచి వెళ్లిపోయినట్లే అని ప్రాసిక్యూషన్ న్యాయవాది వాదించారు. ఇందులో న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉండడంతో అత్యున్నత ఆదేశాల కోసం సీఎంఎం (Chief Metropolitan Magistrate) కోర్టు ముందు దస్త్రాలను ఉంచాలని ఆదేశించారు. దీనిపై నిర్ణయాన్ని సీఎంఎం కోర్టు న్యాయాధికారి రాజశేఖర్ తీసుకోవాల్సి ఉంది.