వైఎస్సార్సీపీలో టికెట్ వచ్చినంత మాత్రాన ఎమ్మెల్యే కాలేరు : ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి - Criticism of YSRCP leaders
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 10, 2024, 10:46 PM IST
Political Battle Between YSRCP Leaders in Anantapur District : అనంతపురం జిల్లాలో మహిళలకు నాలుగో విడతకింద అందించే ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇది ప్రస్తుత ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారైన మెట్టు గోవింద్ రెడ్డిల మధ్య వ్యక్తిగత విమర్శలకు వేదికగా మారింది. రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ టికెట్ దక్కించుకున్న గోవింద్ రెడ్డిపై తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. ఎమ్మెల్యే టికెట్ సాధించుకున్నంత మాత్రాన గెలవలేరని జోష్యం చెప్పడంతో పాటు వ్యంగస్త్రాలను సంధించారు.
దీంతో వ్యక్తిగత విషయాలు సమావేశంలో ప్రస్తావించడం సరికాదని గోవిందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తాను ఓడిపోయే వ్యక్తిని కాదని ధీమా వ్యక్తం చేశారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో ఆసరా కార్యక్రమం తీవ్ర గందరగోళంగా మారింది. దీంతో ఇరు వర్గీయులు సభలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సభాస్థలం నుంచి వెళ్లిపోయారు.