సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు సంకెళ్లు - పోలీసుల తీరుపై విమర్శలు - handcuffs to software engineer
🎬 Watch Now: Feature Video
Police Handcuffs to Software Engineer: పల్నాడు జిల్లాలో ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు సంకెళ్లు వేయటం విమర్శలకు తావిచ్చింది. మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన పంగులూరి అఖిల్‌ను దాచేపల్లి పోలీసులు ఈనెల 14వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. దాచేపల్లి సీఐ సురేంద్ర అతనిని తీవ్రంగా కొట్టడంతో గాయపడ్డారు. ఇదే విషయం కోర్టుకు కూడా చెప్పడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు.
ప్రస్తుతం గుంటూరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అఖిల్‌ను ఇవాళ మరోసారి వైద్య పరీక్షలు కోసం తరలించే సమయంలో పోలీసులు అతని చేతికి సంకెళ్లు వేశారు. అక్కడే ఉన్న అతని భార్య, తల్లిదండ్రులు సంకెళ్లు వేసే సమయంలో విలపించారు. అఖిల్‌ను పరామర్శించేందుకు జైలు వద్దకు వెళ్లిన టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అతనేమైనా బందిపోటా, నక్సలైటా అంటూ కనపర్తి శ్రీనివాస్ ప్రశ్నించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అఖిల్‌ను ఆటో ఎక్కించి ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.