కస్టమర్లు 'చల్లగా' ఉండాలని వినూత్న ఆలోచన - పెట్రోల్ బంక్ పైకప్పు చుట్టూ స్ప్రింక్లర్ల ఏర్పాటు - Sprinklers Arrange in Petrol Bunk - SPRINKLERS ARRANGE IN PETROL BUNK
🎬 Watch Now: Feature Video
Published : Apr 30, 2024, 4:50 PM IST
Petrol Bunk Management Arranged Sprinklers : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా సూర్యుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 6 ప్రాంతాల్లో అత్యధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 45 డిగ్రీలను దాటి భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. సూరీడి ప్రతాపానికి కరీంనగర్ జనం విలవిల్లాడుతున్నారు. రోజురోజుకూ ఎండలు పెరుగుతుండగా, వారం రోజుల్లో జమ్మికుంటలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మిగిలిన ఐదుచోట్ల 45 డిగ్రీల సెల్సియస్ దాటి గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇంతటి ఎండలకు వడగాలులూ తోడయ్యాయి. ఫలితంగా పగలు జనాలు బయటకు రావడానికి భయపడుతున్నారు.
అయితే ఈ ఎండల నుంచి ఉపశమనం కోసం కొందరు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఇంటి పైకప్పుపై స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకుని తాత్కాలికంగా రిలీఫ్ పొందుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ బంక్ యజమాని సైతం ఇదే విధంగా ఆలోచించాడు. ఎండల కారణంగా ప్రజలు బంక్‌కు రావడానికి జంకుతుండటంతో రూ.60 వేలు వెచ్చించి స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. పెట్రోల్ బంక్ పైకప్పు చుట్టూ దాదాపు 50 స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయడంతో చల్లటి వాతావరణం ఏర్పడిందని వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.