రాజీనామా అనంతరం వేమిరెడ్డి ఇంటికి క్యూ కడుతున్న నేతలు - Vemireddy quit the ycp party
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 9:46 PM IST
MP Vemireddy Prabhakar Reddy Resigns YCP Party : రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. అలాగే నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవినీ వదులుకున్నారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా సమర్పిస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. వైసీపీకి చేసిన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని సీఎం జగన్ను వేమిరెడ్డి కోరారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి భారీగా అభిమానులు తరలిరాగా, పలువురు నాయకులు ఆయనను కలిశారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేతలు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తోపాటు రూప్ కుమార్ యాదవ్, పలువురు కార్పొరేటర్లు వేమిరెడ్డిని కలిశారు. అధికార పార్టీ కుట్రలు భరించలేక వేమిరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి వేమిరెడ్డి ఎనలేని కృషి చేశారని, అయినా పార్టీలో ఆయనకు అవమానాలు దక్కాయన్నారు. వివాదరహితుడు, సేవాగుణం గలిగిన వేమిరెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి రావాలని తాము ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.