సహజీవనంతో బిడ్డ-ఆపై కటిక పేదరికం- పసిగుడ్డును ఏం చేసిందంటే? - Mother Sold Baby For Money - MOTHER SOLD BABY FOR MONEY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 27, 2024, 3:36 PM IST
Mother Sold Her Baby Money Due to Financial Difficulties: ఆర్థిక ఇబ్బందులతో పురిటి బిడ్డను అమ్ముకున్న అమానుష ఘటన ఒంగోలు రిమ్స్‌లో వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలానికి చెందిన ఓ మహిళకు అప్పటికే ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడబిడ్డ సంతానం. భర్తతో విడాకులు తీసుకున్న మహిళ పిల్లలతో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో మరో వ్యక్తితో సహజీవనం చేస్తూ గర్భం దాల్చింది. 48 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడంతో రక్తహీనత, నిమోనియా చుట్టుముట్టాయి. దీంతో ప్రసవం వేళ ఆమె ఆరోగ్యం ఆందోళనగా మారింది. ఈ సమయంలో ఆమె నెల్లూరు జిల్లా కందుకూరు వైద్యశాలలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, బాలింత పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ఆమెను చికిత్స నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. పెంచి పోషించలేనని భావించిన మహిళ శిశువును విక్రయించటానికి సిద్ధమైంది.
ఈ సమయంలో ఆసుపత్రిలో పరిచయం అయిన మరో మహిళతో కలిసి తెలంగాణ ఖమ్మం జిల్లాకు చెందిన వారికి పసిపాపను 10 వేల రూపాయలకు విక్రయించారు. శిశువు తల్లికి 6 వేలు ఇచ్చి మిగిలిన 4 వేల రూపాయలు దళారులు తీసుకున్నట్లు తెలుస్తోంది. తల్లి, బిడ్డ కనిపించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది బాలల సంరక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. సీడీపీవో ఫిర్యాదు మేరకు పోలీసులు శిశువు ఆచూకీ తెలుసుకుని పసికందును ఒంగోలు బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.