ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు : తుమ్మల
🎬 Watch Now: Feature Video
Minister Tummala Review Meeting with Officials : అధికారం చేపట్టిన నాటి నుంచి సమీక్షలు, సమావేశాలతో కాంగ్రెస్ నేతలు పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. శాఖల వారీగా రివ్యూలు చేస్తూ సంబంధిత అధికారులకు తగు సలహాలు, సూచనలు, ఆదేశాలు ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే పద్ధతులు మార్చుకోవాలని, లేదంటే ఉద్యోగాన్ని వదిలి మరేదైనా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హెచ్చరించిన సంగతి కూడా తెలిసిందే. మంత్రులు సైతం ముఖ్యమంత్రి స్టైల్లోనే ముందుకు సాగుతున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇస్తున్నారు.
తాజాగా ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలోని పనుల పురోగతిపై అన్ని శాఖల అధికారులతో చర్చించారు. పెండింగ్ పనులను ఆపకుండా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్, మంచి నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు.