చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తాం : మంత్రి తుమ్మల
🎬 Watch Now: Feature Video
Minister Tummala On Handloom Sector Telangana : నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర వ్యవసాయ, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్ నారాయణగూడ పద్మశాలి భవన్లో జరిగిన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. చేనేత కార్మికుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని మంత్రి తుమ్మల అన్నారు.
Padmashali Program in Hyderabad : గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వరంగల్, పోచంపల్లి, గద్వాల్ టెక్స్టైల్ పార్క్‌లు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని త్వరితగతిన ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. తనకు ఈ రంగంలో అనుభవం లేదని, అయినప్పటికీ సంబంధిత అధికారులు, అనుభవజ్ఞులైన సంఘం ప్రతినిధుల సూచనలు తీసుకొని చేనేత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కమర్తపు మురళితో మంత్రి తుమ్మల ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎల్. రమణ, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, వరంగల్ మహానగర పురపాలక సంఘం మేయర్ గుండు సుధారాణి తదితరులు హాజరయ్యారు.