చంద్రబాబు ఎక్కువ మాట్లాడితే రాళ్ల దెబ్బలు తప్పవు - మంత్రి పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు - tdp
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 29, 2024, 9:53 AM IST
Minister Peddireddy Ramachandra Reddy Sensational Comments: పీలేరు సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఇష్టారీతిన మాట్లాడితే రాళ్ల దెబ్బలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రారని, కుప్పంతో సహా జిల్లాలో మొత్తం అన్ని నియోజకవర్గాలలో ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ఎన్నికల్లో పోరాడాలని, చౌకబారు మాటలు మాట్లాడటం తగదన్నారు.
కాగా మంత్రి పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి పీలేరును పీక్కుతింటున్నారని పీలేరులో నిర్వహించిన 'రా కదలిరా' సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. అంగళ్ల ఘటనను గుర్తుచేసుకుంటూ ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డిని ఉద్దేశిస్తూ చంద్రబాబు హెచ్చరించారు. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి తాజాగా స్పందించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.