విద్యుత్ శాఖపై మంత్రి గొట్టిపాటి సమీక్ష- 'నష్టపోయిన ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తాం' - Gottipati Review Electricity Dept
🎬 Watch Now: Feature Video
Gottipati Review on Power Dept : విద్యుత్ శాఖ అధికారులతో శనివారం నాడు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుదాఘాతంతో మృతిచెందిన వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో మాదిరి కాకుండా తక్షణమే ప్రాణనష్టాన్ని తగ్గించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటివరకు మరణించిన వారు ఎలా చనిపోయారో నివేదికను రూపొందించాలని ఆయన ఆదేశించారు.
అధిక ప్రాణనష్టం ఏ విధంగా జరుగుతుందో అంచనా వేయాలని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. భూముల దగ్గర వేలాడుతున్న వైర్ల కారణంగా కూడా విద్యుదాఘాతంతో ప్రజలు, సిబ్బంది మృత్యువాత పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాడుతున్న విద్యుత్ వైర్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, తగిన చర్యలు చేపట్టాలని గొట్టిపాటి అధికారులకు ఆదేశాలిచ్చారు.
విద్యుత్ లైన్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని గొట్టిపాటి పేర్కొన్నారు. తదుపరి సమీక్ష నాటికి అధికారులంతా పూర్తి సమాచారంతో రావాలని ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు సమస్యను తక్షణమే పరిష్కరించే విధంగా చొరవ చూపాలని చెప్పారు. అలాకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరెంట్ షాక్తో మృతిచెందిన వారికి పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం తమ సర్కార్ విధానం కాదని అసలు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రభుత్వమని స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికీ న్యాయం చేస్తామని గొట్టిపాటి హామీ ఇచ్చారు.