రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి: మంత్రి అచ్చెన్నాయుడు - Minister Review With Officials
🎬 Watch Now: Feature Video
Minister Atchannaidu Held Review With Officials: రాష్ట్రంలో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టేలా సూచనలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. అల్పపీడన ప్రభావం, పంట నష్టం, ఎరువుల లభ్యత తదితర అంశాలపై అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి అన్నారు. పంట పొలాల్లో నిలిచిన నీళ్ల తొలగింపు, తేమ ద్వారా వ్యాపించే తెగుళ్ల నివారణకు రైతులకు పలు సూచనలు చేయాలని అధికారులకు మంత్రి నిర్దేశించారు.
ఉపాధి హామీ పథకంలో పంట కాలువలు, డ్రెయిన్లలో తక్షణమే పూడిక తీసి నీటి సరఫరా సజావుగా సాగేలా చూడాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు. చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రైతులకు తీవ్ర నష్టం జరిగేలా కనిపిస్తోంది. కొన్ని చోట్ల వరద ఉద్ధృతికి పంటలు నీటిలో మునిగిపోయాయి. అదే విధంగా రహదారులపై భారీగా నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు సైతం స్తంభించిపోతున్నాయి.