రంగు రంగుల లైట్ల వెలుతురులో.. పర్యాటకులను మైమరిపిస్తున్న కొత్తపల్లి జలపాతం - LIGHTS AT KOTHAPALLI WATERFALLS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2024, 1:05 PM IST
Lights are installed at Kothapalli Waterfalls : చుట్టూ ఎత్తయిన కొండలు, పెద్దపెద్ద లోయలు. గలగలపారే సెలయేళ్లు, ఎటువైపు చూసిన పచ్చదనం, మనసును ఆనంద పరిచే ఆహ్లాదకర వాతావరణం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రకృతి అందాల గురించి ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువే మరి. ఇంకోవైపు అబ్బురపరిచే మంచు మేఘాలు. దేవ లోకమే భువికి దిగొచ్చిందా అన్నట్టుగా అంత అద్భుతమైన దృశ్యాలు అక్కడ కనిపిస్తాయి. నలుదిక్కుల్లో ఎటువైపు చూసినా కనువిందే. ఒక్క మాటలో చెప్పాలంటే అదోక అద్భుత ప్రపంచం. మన్యంలోని ఏ మూలకు వెళ్లినా ప్రకృతి ప్రేమికులు పరవశించిపోవడం ఖాయం. అంతలా ఉంటాయ్ మరి అక్కడి ప్రకృతి అందాలు. అలాంటి అందాల మధ్య ప్రకృతి ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది ఓ జలపాతం. అదే కొత్తపల్లి జలపాతం. జి.మాడుగుల మండలంలో ఉన్న ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్‌కి పర్యాటకులు క్యూ కడుతున్నారు.
ప్రస్తుతం పర్యాటకులకు మరింత ఆనందాన్ని పంచేందుకు జలపాతం కొత్త హంగులతో ముస్తాబైంది. అల్లూరి జిల్లాను పర్యాటకంగా తీర్చిదిద్దడానికి ఐటీడీఏ పీఓ అభిషేక్ అడుగులు వేస్తున్నారు. పాడేరు, చింతపల్లి ప్రధాన రహదారిలో ఉన్న కొత్తపల్లి జలపాతాన్ని రాత్రి వేళలో పర్యాటకులు సందర్శించడానికి లైట్లు ఏర్పాటు చేశారు. రంగు రంగుల లైట్ల వెలుతురులో కొత్తపల్లి జలపాతం దగదగా మెరుస్తోంది. కొండ గోడలు రంగు రంగుల బొమ్మలతో ఆకట్టుకోనున్నాయి. త్వరలో దీనిని ప్రారంభించడానికి సిద్ధం చేశారు.