ఎస్సీ కులానికి చెందిన వాడినని చిన్నచూపు చూస్తున్నారు- కనిగిరి ఏఎంసీ ఛైర్మన్ - కనిగిరి ఏఎంసీ ఛైర్మన్ ఆవేదన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 25, 2024, 7:52 PM IST
Kanigiri AMC Chairman Anguish: ఎస్సీ కులానికి చెందిన వాడినని తనను చిన్న చూపు చూస్తున్నారని ప్రకాశం జిల్లా కనిగిరి ఏఎంసీ (Agriculture Market Committee) ఛైర్మన్ సాల్మన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా ఏ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సాక్షిగా అవమానపరుస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ తనను మెచ్చి రెండు నెలల క్రితం ఏఎంసీ ఛైర్మన్గా నియమించారని పేర్కొన్నారు. అయితే బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనను ఏ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా అవమానపరుస్తున్నారని అన్నారు.
తాను ఎస్సీ కులానికి చెందిన వాడిని కాబట్టే ఎవరూ పిలవడం లేదని, వైసీపీ నేతలు, పలువురు అధికారులు తనను అవమానపరుస్తున్నారంటూ విలేకరుల సమావేశంలో ఆవేదనను వెలిబుచ్చారు. ముఖ్యంగా వైసీపీలోని ఓ ప్రధాన నాయకుడే అధికారులతో కుమ్మక్కై తనకు ఎటువంటి ఆహ్వానాలు అందకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని కనిగిరి ఏఎంసీ ఛైర్మన్ సాల్మన్ రాజు కోరారు.