అహ్మద్ బాషా కడప నయీం కావాలని చూస్తున్నాడు: టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి - కడప వైసీపీ నేతల ఆగడాలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 10:45 PM IST
Kadapa TDP Leaders Complaint to SP: కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాతో పాటు అతని సోదరుడు అహ్మద్ బాషా నుంచి తమకు ప్రాణహాని ఉందని, కడప తెలుగుదేశం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అహ్మద్ బాషా పోలీసులు, మీడియా ఎదుటే తన కుటుంబం పట్ల అవమానకరంగా మాట్లాడారని తెలుగుదేశం నేత మాధవీరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు ఫిర్యాదు చేశారు. వారి వల్ల మైనార్టీలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె అన్నారు. అంతేకాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడన్నారు.
పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తే మంత్రి సోదరుడి దౌర్జన్యం తెలుస్తుందని మాధవీరెడ్డి పేర్కొన్నారు. మంత్రి సోదరుడి ఆగడాలను అరికట్టాలన్నారు. శాంతి భద్రతలను అదుపులో పెట్టకపోతే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలుగుదేశం నేత శ్రీనివాసులరెడ్డి హెచ్చరించారు. గతంలో హైదరాబాద్‌లోని గ్యాంగ్‌స్టార్ నయీం మాదిరిగానే, అంజాద్ బాషా సోదరుడు కడప నయీం కావాలని చూస్తున్నాడని ఆయన అన్నారు. గ్యాంగ్ స్టార్‌లాగా వార్నింగ్‌లు ఇస్తున్నాడని వాపోయారు.