thumbnail

బెంగళూరు నుంచి విజయవాడ చేరుకున్న జగన్‌- కనిపించని 'ఆ ముగ్గురు' నేతలు - Jagan came from Bangalore

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 8:01 PM IST

Jagan Returned to Vijayawada from Bangalore : ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బెంగళూరు ఎలహంకలోని తన ప్యాలెస్‌కు వెళ్లిన మాజీ సీఎం జగన్ తిరిగి విజయవాడ వచ్చారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌కు వైఎస్సార్సీపీ నేతలు స్వాగతం పలికారు. జగన్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన నేతల్లో పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్‌ మాత్రమే ఉన్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో జరిగే ప్రతి కార్యక్రమంలో కనిపించే మాజీ మంత్రులు కొడాలి నాని, జోగి రమేష్, మల్లాది విష్ణు, తదితర ఓటమి పాలైన వైఎస్సార్సీపీ నేతలు విమానాశ్రయానికి రాకపోవడం గమనార్హం. దీంతో జగన్‌ వచ్చిన వారికి అభివాదం చేస్తూ నేరుగా తాడేపల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు.

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి తరువాత జగన్ తొలిసారి జూన్ 22న తాడేపల్లి నుంచి పులివెందులకు వెళ్లారు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా పులివెందుల నివాసంలో మూడురోజులు ఉండటంతోపాటు ప్రజలను నేరుగా కలుసుకునే అవకాశం ఇచ్చారు. దీంతో చాలామంది గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల బకాయిల గురించే ఆయన వద్ద ప్రస్తావించి ఉక్కిరిబిక్కిరి చేశారు. బిల్లులు సంగతి తేల్చాలంటూ నిలదీయడంతో తన పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.