కంభంపాడులో వైఎస్సార్సీపీ నేత అక్రమ నిర్మాణం - భవనం కూల్చివేతతో ఉద్రిక్తత - YSRCP Leader Illegal Construction - YSRCP LEADER ILLEGAL CONSTRUCTION
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-07-2024/640-480-21852796-thumbnail-16x9-illegal-construction-demolished.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 9:16 PM IST
Illegal Construction Demolished at Kambhampadu: ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కంభంపాడులో వైఎస్సార్సీపీ ఎంపీపీ భర్త చెన్నారావు చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దగ్గరుండి కూల్చేశారు. వైఎస్సార్సీపీ నేత చెన్నారావు కంభంపాడులో రోడ్డు పక్కన అక్రమంగా భవనాన్ని నిర్మించారంటూ ఎమ్మెల్యే కొలికపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు తెలుగుదేశం శ్రేణులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ కార్యర్తలు భారీగా చేరుకున్నారు. ఎలాగైనా భవనాన్ని కూల్చేయాలంటూ ఎమ్మెల్యే కొలికపూడి కారుపై నిల్చుని డిమాండ్ చేశారు. ప్రొక్లెయిన్ తెప్పించి అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు.
అప్పటివరకు అక్కడకు రాని రెవెన్యూ అధికారులు భవనాన్ని పాక్షికంగా కూల్చేసిన తర్వాత వచ్చారు. భవనాన్ని స్వాధీనం చేసుకుని చుట్టూ ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. నోటీసులు జారీ చేసి సర్వే చేస్తామని అక్రమ నిర్మాణం అని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెలుగుదేశం, వైఎస్సార్సీపీ కార్యకర్తల మోహరింపుతో కొన్నిగంటలపాటు ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.