ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు హైదరాబాద్‌ను కొనసాగించాలనే పిల్‌ను కొట్టేసిన హైకోర్టు - Common Capital Pil Dismiss HC
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 14, 2024, 11:31 AM IST
High Court Dismiss litigation to Bring Law as Common Capital: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు చట్టం తీసుకొచ్చేలా కేంద్రం హోంశాఖను ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారంపై చట్టం చేయాలని పార్లమెంట్‌ను తాము ఎలా ఆదేశించగలమని ప్రశ్నించింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయని ఆదేశాలివ్వడం పిల్ వేసినంత సులువు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని నిబంధనలను అనుసరించి రెండు రాష్ట్రాల మధ్య అప్పులు, ఆస్తులు, కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తి కాలేదని హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరుతూ ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజాసంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ ఈ పిల్‌ను హైకోర్టులో వేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది కౌశిక్ వాదనలు వినిపిస్తూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించి ఈ సంవత్సరం జూన్ 2తో సరిగ్గా పది సంవత్సరాలు పూర్తవుతాయన్నారు. ఆస్తులు, అప్పుల విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు మరో పదేళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాల్సిన అవసరం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై చట్టం చేసేలా తాము పార్లమెంట్‌ను ఏ విధంగా ఆదేశించగలమని ప్రశ్నిస్తూ హైకోర్టు పిల్‌ను కొట్టేసింది.