భవిష్యత్తు తరాలకు మేలు చేసేలా కూటమి మేనిఫెస్టో- ముస్లింలందరూ టీడీపీకి అండగా నిలవాలి : ఫరూక్ షిబ్లీ - MUSLIMS SUPPORT TDP - MUSLIMS SUPPORT TDP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 4, 2024, 5:27 PM IST
Farooq Shibli Said Muslims are Support to NDA Alliance : తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ముస్లిలకు కేటాయించిన పథకాలు వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా ఉన్నాయని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫరూక్ షిబ్లీ అభిప్రాయపడ్డారు. గతంలో ముస్లింల బడ్జెట్ను నవరత్నాలకు మళ్లించి వైసీపీ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని ఆయన ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీ మ్యానిఫెస్టో భవిష్యత్తు తరాలకు సైతం మేలు చేసేవిధంగా ఉందని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలతోపాటు ప్రత్యేకంగా ముస్లింలకు మ్యానిఫెస్టోలో ఎన్నో హామీలిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప నయా పైస నిధులు ఇవ్వలేదని షిబ్లీ గుర్తు చేశారు.
టీడీపీ ఎన్నికల ప్రణాళికలో దుల్హన్ వంటి పథకాలకు ఎలాంటి షరతులు లేకుండా ఆర్థికసాయం అందించనున్నారని చెప్పారు. ముస్లింలకు రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, ఇమామ్, మౌజమ్ లకు రూ.10వేలు, రూ,5వేలు చొప్పున ఆర్థికసాయం అందించడం గొప్ప విషయమన్నారు. మసీదుల నిర్వహణకు ప్రతి నెలా 5వేల రూపాయల చొప్పున వక్ఫ్ బోర్డు ద్వారా ఇస్తామని ప్రణాళికలో చెప్పారని తెలిపారు. హజ్ యాత్ర చేసేవారికి లక్ష రూపాయల ఆర్థికసాయం, విదేశీవిద్య పథకానికి నిధులు వంటివి ఎన్నో టీడీపీ ఎన్నికల ప్రణాళికలో ఉన్నాయని వెల్లడించారు. కాబట్టి ముస్లింలందరూ టీడీపీకి అండగా నిలవాలని షిబ్లీ కోరారు.