జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయి: రైతు సంఘం నేతలు - అనంతలో రైతు సంఘాల ఆందోళన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2024, 3:03 PM IST
Farmers Protest In Anantapur: రైతు పేరు చెప్పి పదవిలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర నష్టంతో ఉన్న రైతులను జగన్ మోహన్ రెడ్డి ఆదుకుంటారన్న ఆశ సన్నగిల్లిందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరయ్య ఆరోపించారు. అనంతపురంలోని సంఘమేశ్ కూడలి నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు రైతు సంఘం నేతలు, రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
కలెక్టరేట్ ఎదుట ఎద్దుల బండ్లు పెట్టుకొని రైతులు ఆందోళన నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కరవు విలయతాండవం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి లేక ఉమ్మడి అనంతపురం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బెంగుళూరు, కేరళకు వలస వెళ్లి వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారని ఈశ్వరయ్య తెలిపారు. అన్ని విధాలా నష్టపోతున్న రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నా జగన్ మోహన్ రెడ్డికి పట్టించుకోవడం లేదని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లిఖార్జున ఆరోపించారు. డెబ్బై ఏళ్లలో ఎన్నడూ లేనంత కరవు ఈసారి అనంతపురం జిల్లా రైతులు చూడాల్సి వచ్చిందని, అన్నదాతను ఆదుకునే ప్రయత్నం చేయటం లేదని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.