మళ్లీ కుంగిన ఏటిగట్టు - శాశ్వత పరిష్కారం చూపాలంటున్న గ్రామస్థులు - GEDDANAPALLI ETIGATTU DEPRESSED - GEDDANAPALLI ETIGATTU DEPRESSED
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2024, 5:56 PM IST
Yetigattu Collapsed at Geddanapalli : కోనసీమ అంబేడ్కర్ జిల్లాలో ఏటిగట్టు మళ్లీ కుంగుబాటుకు గురైంది. ఐ. పోలవరం మండల పరిధిలోని మురుమళ్ల నుంచి కాట్రేనికోన మండలం పరిధిలోని గెద్దనాపల్లి వద్ద ఉన్న ఏటిగట్టు కుండలేశ్వరం వద్ద కుడివైపునకు నీరు ప్రవహిస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులతో ఈ రోడ్డు వేశారు. అయితే తరువాత కాలంలో కురిసిన వర్షాలకు రోడ్లు సగభాగం పక్కనున్న పంట కాలువలోకి కుంగింది. దీనిని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించి తాత్కాలికంగా గ్రావెల్ వేసి పూడ్పించే ప్రయత్నం చేశారు. కానీ గడచిన రెండు వారాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతం పంట కాలువలోకి చేరి సర్వనాశనమైంది.
శాశ్వత పరిష్కారం కల్పించాలి: ప్రాంతంలో ఎక్కువగా ఆక్వా చెరువులు ఉండటంతో భారీ వాహనాలు, కార్లు, ఆటోలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ రోడ్లలో ఆటోలు వెళ్లేంత మార్గమే ఉండడంతో ఇతర వాహనదారులు 30 కి.మీ దూరంలో ఉన్న మహిపాల్ చెరువు మీదుగా తిరిగి కుండలేశ్వరం రావాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. గోదావరికి వరదలు సంభవిస్తూ ఉండటంతో ఏటిగట్టు ఏమాత్రం తెగినా నాలుగు గ్రామాలతో పాటు వేల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, ఆక్వా చెరువులు ముంపునకు గురవుతాయని, అధికారులు తక్షణమే శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.