మూలాలు మరువని డీఎస్పీ - కమ్మరి కొలిమిలో పనిచేస్తున్న వీడియో వైరల్ - DSP Nagendrachari viral video - DSP NAGENDRACHARI VIRAL VIDEO
🎬 Watch Now: Feature Video
Published : Jun 3, 2024, 7:38 PM IST
DSP Nagendrachari Viral Video : కష్టపడే వారికే కష్టం విలువ తెలుస్తుందన్న సామెతను గుర్తు చేస్తూ, కమ్మరి కొలిమిలో నిప్పు రాజేస్తూ తన చిన్ననాటి వృత్తి నైపుణ్యాన్ని మరోసారి నెమరు వేసుకున్నారు ఓ పోలీసు ఉన్నతాధికారి. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ డీఎస్పీగా పనిచేస్తున్న నాగేంద్రచారి విధుల్లో భాగంగా చందుర్తి మండలం మల్యాల గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కన ఉన్న కమ్మరి కొలిమి కంటపడటంతో ఆగారు. దగ్గరికి వెళ్లి ఆ కొలిమిలో పని చేస్తున్న పెద్ద మనిషితో మాట్లాడారు. కాసేపు వ్యవసాయ పనిముట్లను సానబెడుతూ తన చిన్నతనంలో నాన్నతో కులవృత్తిలో సాయపడ్డ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంలో మునిగిపోయారు.
ఒక అధికారి హోదాలో ఉండి కూడా చిన్ననాటి మూలాలను మర్చిపోకుండా, తన చిన్నతనంలో చేసిన కుల వృత్తిపట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని చూసి గ్రామస్తులు అబ్బురపడిపోయారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన డీఎస్పీ నాగేంద్ర వీడియోను చూసిన నెటిజన్లు అభినందిస్తున్నారు. ఒక మనిషి ఎంతటి హోదాలో ఉన్న కూడా తను పుట్టి పెరిగిన మూలాలను మార్చిపోవద్దని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారిని చూస్తే తెలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.