ఖాళీ స్థలాలను కాజేసేందుకు వైసీపీ కార్పొరేటర్ యత్నం- మహిళలు ఆగ్రహం - YCP Corporator Land Attempt Seizure - YCP CORPORATOR LAND ATTEMPT SEIZURE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 11, 2024, 9:48 AM IST
Dalit Women protest YCP Corporator Land Attempted to Seizure: రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయి వీధిన పడ్డామన్న కనికరం కూడా లేకుండా వైసీపీ కార్పొరేటర్ అచ్చాల వెంకట్ రెడ్డి తమ స్థలాలను కాజేసేందుకు యత్నిస్తున్నారని గుంటూరులో దళిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ఏటీ ఆగ్రహారంలో రోడ్డు విస్తరణలో భాగంగా దళితులు నివసిస్తున్న ఇళ్లను అధికారులు కూల్చి వేశారు. దీంతో రోడ్డు అవతలి ఖాళీ స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేసుకుని అక్కడే నివాసముంటున్నారు. స్థానిక వైసీపీ కార్పొరేటర్ ఏ. వెంకటరెడ్డి ఫిష్ ఆంధ్రా కంటైనర్ పెట్టి ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు చూస్తున్నారని బాధిత దళితులు ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తే అసభ్య పదజాలంతో దూషించారని మహిళలు వాపోయారు. దళితులు ఏడు దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తుంటే కార్పొరేటర్ ఇది తన స్థలమని దొంగ కాగితాలు సృష్టించి దౌర్జన్యానికి దిగి దుర్భాషలాడుతున్నాడని తెలిపారు.
ఆ స్థలంలో ఉన్న బడ్డీ కొట్లకు ట్రేడ్ లైసెన్స్ 2018 నుంచి 2022 వరకు ఉందని వారు పేర్కొన్నారు. ఇప్పుడు కార్పొరేటర్ సచివాలయ సిబ్బందితో ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణ కాకుండా చేశారని వాపోయారు. కార్పొరేటర్ దౌర్జన్యాలకు మద్దతుగా ఓ ప్రజాప్రతినిధి అండగా ఉండి పోలీసులతో బెదిరిస్తున్నాడని మహిళలు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో దళితులు తమ బంధువులు అంటూ ఉపన్యాసాలు ఇస్తున్న సీఎం జగన్ దళితుల స్థలాలను అగ్రకులాల వారు కబ్జా చేస్తుంటే ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. దళితుల స్థలాలు కబ్జా చేస్తున్న వారిపై మహిళలకు రక్షణ కల్పించాలని లేదంటే ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.