కలెక్టర్ పేరుతోనే ఫేక్ అకౌంట్-ఆపై డబ్బులు పంపాలంటూ మెసేజ్‌లు - cyber fraud with collector name - CYBER FRAUD WITH COLLECTOR NAME
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 11, 2024, 9:46 PM IST
Cyber Fraud with Collector Name: సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. నియంత్రణకు సంబంధిత శాఖాధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, రోజుకొక కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. సామాన్యులతో పాటు బడా వ్యాపారులు, నేతలు, అధికారులు, ఉపాధ్యాయులు, యువత లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. చివరికి, ఐఏఎస్ అధికారులను సైతం సైబర్ నేరగాళ్ల వదిలి పెట్టడం లేదు. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పేరు, ఫోటోతో వాట్సాప్ ఖాతా సృష్టించుకొని సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలుకు పాల్పడ్డారు.
"నేను, సమావేశంలో ఉన్నాను. డబ్బులు అవసరం ఉంది. అత్యవసరంగా పంపండి" అంటూ సైబర్ నేరగాళ్లు ఆయన నకిలీ ఖాతా నుంచి సంక్షిప్త సమాచారం పంపి, స్వయంగా ఫోన్లు చేయడం చేస్తున్నారు. ఇది నిజమే అని నమ్మి, కొంత మంది సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాకు నగదు కూడా పంపినట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ దృష్టికి రావటంతో ఆయన తక్షణం స్పందించారు. ఇది సైబర్ నేరగాళ్ల మోసపూరిత కుట్ర అని, ఎవరూ డబ్బులు వేయవద్దని పలు వాట్సాప్ గ్రూప్‌లలో సమాచారం అందించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇటువంటి నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు.