తాగునీటి బిల్లులు మంజూరు చేయమంటే మంత్రి సురేష్ ముఖం చాటేస్తున్నాడు- వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం
🎬 Watch Now: Feature Video
Concerns of YCP Leaders to Release Bills of Water Tankers : నాలుగున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న నీళ్ల ట్యాంకర్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన చేశారు. బిల్లులను వెంటనే విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని నాయకులు హెచ్చరించారు. యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలంలోని హనుమాన్ జంక్షన్ వద్ద నీళ్ల బిల్లులను విడుదల చేయాలంటూ ఐదు మండలాలకు చెందిన వైసీపీ నాయకులు రహదారిపై ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత నాలుగున్నరేళ్లుగా లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి గ్రామాల్లో నీళ్లు తోలుతున్నా బిల్లులు మంజూరు రాకపోవడం దారుణమన్నారు.
కనీసం ఇళ్లు గడవడానికి కూడా కష్టంగా మారిందని ట్యాంకర్ల యజమానులు వాపోయారు. ట్రాక్టర్ల సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు నూతనంగా వచ్చిన ఇంఛార్జి తాడిపత్రి చంద్రశేఖర్‌ను ఎన్నిసార్లు అడిగినా అదిగో ఇదిగో అంటున్నారే తప్ప బిల్లులు మంజూరు చేయించే పరిస్థితి లేదని వాపోయారు. మరి కొద్ది రోజులు ఇలానే ఉంటే ఎన్నికల సమయంలో గ్రామాల్లో వైఎస్సార్సీపీ తరపున ఏజెంట్లగా కూడా కూర్చునే వారు ఉండరని హెచ్చరించారు.