వసూళ్లపై ఉన్నంత శ్రద్ద ప్రభుత్వానికి రైతుల సమస్యలపై లేదు : జగదీశ్ రెడ్డి
🎬 Watch Now: Feature Video
BRS MLA Jagadish Reddy On Water Crisis in Nalgonda : కాంగ్రెస్ నేతలకు రాజకీయాలు, అక్రమ వసూళ్లపై ఉన్న శ్రద్ద రైతులపై లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోయి అన్నదాతలు బోరున విలపిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా అన్నపర్తిలో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి ఎండిన పంట పొలాలు, నిమ్మ తోటలను పరిశీలించారు. అన్నదాతలతో ముచ్చటించి, వారి బాధలను అడిగి తెలుసుకున్నారు.
ఒకవైపు ప్రకృతి వైపరీత్యం అయితే మరోవైపు ప్రభుత్వ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కరెంటు లేక తక్కువ వోల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయని వార్తలు వస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల నిర్వహణ చూస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా కనిపిస్తోందని చెప్పారు. మూసీ ప్రాజెక్టు కింద నీరందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీటిని తెప్పించి రైతులకి అందించాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.