బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రాగానే జగన్ దోచుకున్న సొమ్మును కక్కిస్తాం: సీఎం రమేష్ - CM Ramesh Fire on CM Jagan
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 12, 2024, 10:33 PM IST
BJP Leader CM Ramesh Fire on CM Jagan : రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అరాచక, దోపిడీ పాలనకు ప్రజలు త్వరలో బుద్ధి చెప్తారని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలయికతో (TDP-Janasena-BJP Alliance) తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రం నుంచి జగన్ పాలన పోవాలని పిలుపునిచ్చారు. జగన్ పేద ప్రజలు రక్తాన్ని పీల్చి సంపాదించిన సొమ్ము వెనక్కు రప్పిస్తామని, రాష్ట్రంలో మద్యం తాగేవారి నుంచి కోట్ల రూపాయలను కొల్ల గొడుతున్నారని విమర్శించారు. జగన్ ఏ నాయకుడిని కలవకుండా నియంతలా వ్యవహరించారని, జగన్ మాటలు ప్రజలు నమ్మడం లేదని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, జగన్ సాగనంపడానికి జనం సిద్ధంగా ఉన్నారని అన్నారు. అన్ని విధాలా రాష్ట్రాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం దోచుకుందని అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే జగన్ దోచుకున్న సొమ్మును కక్కిస్తామని అన్నారు. బీజేపీ అధిష్టానం నిర్ణయం మేరకు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే, తాను అక్కడి నుంచే బరిలోకి దిగుతానని సీఎం రమేష్ స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా ప్రజలు 2014 ముందు, ఆ తర్వాత మన దేశ పరిస్థితి బేరీజు వేసుకోవాలని సీఎం రమేశ్ తెలిపారు. 30 వేల కిలోమీటర్లు జాతీయ రహదారి రాష్ట్రంలో వచ్చిందని, కడప ఎయిర్ పోర్ట్ విస్తరణ, నైట్ లాండింగ్ సౌకర్యం కల్పించామని అన్నారు. పార్టీ మేనిఫెస్టో అంటే నాలుగు గదిలో కాదు ప్రజల్లో తిరిగి వివిధ వర్గాల ప్రజాభిప్రాయం తీసుకుని పొందుపరచాలని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా మోదీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.