ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చేనేతల ఆత్మహత్యలు: సత్యకుమార్ - BJP Candidate SatyaKumar Allegation - BJP CANDIDATE SATYAKUMAR ALLEGATION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 19, 2024, 6:24 AM IST
BJP Candidate Satya Kumar Allegations on Jagan at Dharmavaram: చేనేతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ మండిపడ్డారు. ధర్మవరానికి చెందిన చేనేత వైఎస్సార్సీపీ నాయకుడు బీజేపీలో చేరారు. అతడికి సత్యకుమార్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ ధర్మవరం పట్టుచీరలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తానని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఏమైందని ప్రశ్నించారు. ధర్మవరం అంటేనే గుర్తుకు వచ్చేది మగ్గాలు, పట్టు, చేనేత కార్మికులని, వేల కుటుంబాలకు చేయూత ఇస్తున్న చేనేత కార్మికులు కొన్ని సంవత్సరాలుగా అరాచక శక్తుల వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ధర్మవరం తిరోగమన మార్గంలోకి వెళ్లిందని పేర్కొన్నారు. నాయకుడన్న వాడు హామీలు నెరవేర్చడానికి ప్రయత్నించాలని, 100 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చని మనిషి మన రాష్ట్రంలో ఉన్నారని సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధిక వడ్డీ రేట్ల కారణంగా కష్టాల్లో ఉండి ఆత్మహత్య చేసుకున్న 50 మంది చేనేతలకు 5 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పి చివరకు లక్ష యాబై వేలు చేసి దానిని కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారని సత్యకుమార్ మండిపడ్డారు. ధర్మవరం వచ్చిన జగన్ పరదాల చాటున, బస్సులో కుర్చొని పర్యటించారని, ఓటు వేసి గెలిపించిన నేతన్నలను చూడడానికి మనసు రాలేదని ఎద్దేవా చేశారు.