సీఎం క్యాంపు ముట్టడికి వెళ్తే కేసులు తప్పవు- అంగన్వాడీలకు ఎస్పీ హెచ్చరిక - ఏపీ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 22, 2024, 1:30 PM IST
SP Vakul Jindal on Anganawadis Protest: సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడికి వెళ్లొద్దన్న పోలీస్‌శాఖ ఆజ్ఞలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అంగన్వాడీలను ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. అర్ధరాత్రి జిల్లా ఎస్పీ బాపట్ల రైల్వేస్టేషన్ వద్ద పోలీసు బందోబస్తు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అంగన్వాడీలు తలపెట్టిన 'చలో విజయవాడ', 'చలో తాడేపల్లి' కార్యక్రమాలకు ప్రభుత్వ, పోలీసుశాఖల నుంచి ఎటువంటి అనుమతి లేదని ఎస్పీ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులు, బస్‌స్టాండ్లు, రైల్వేస్టేషన్లు సహా ఇతర ముఖ్య ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ జిందాల్ తెలిపారు. విజయవాడ, గుంటూరు, తాడేపల్లిలో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. సీఎం క్యాంప్ ముట్టడికి వెళ్లొద్దని బాపట్ల జిల్లా అంగన్వాడీలకు నోటీసులు జారీ చేశామన్నారు. సీఎం క్యాంప్ ముట్టడికి వెళ్తూ పోలీసులకు పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ జిందాల్ అంగన్వాడీలను హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించకుండా పోలీసులకు సహకరించాలని ఎస్పీ జిందాల్ అంగన్వాడీలను కోరారు.