LIVE : బాలాపూర్ లడ్డూ వేలం పాట - ప్రత్యక్షప్రసారం - Balapur Laddu Auction 2024
🎬 Watch Now: Feature Video
Balapur Laddu Auction 2024 Live : గణేశుడి పండుగంటే గల్లీ నుంచి దిల్లీ వరకు మాములుగా ఉండదు. ఈ ఉత్సవాల్లో లడ్డూ వేలం పాట ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులోనూ వేలంలో రికార్డుస్థాయి ధరతో ప్రత్యేక గుర్తింపు పొందాడు.. బాలాపూర్ గణపతి. అటువంటి మహా ప్రసాద వేళానికి వేళైంది. బాలాపూర్ గణనాథుడి శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. రామమందిరం నమూనా ఉన్న మండపాన్ని ఇప్పటికే తొలగించారు. ఉదయం 5 గంటలకు స్వామి వారికి పూజలు చేసి 6.30 గంటలకు భజనలతో గ్రామ పురవీధుల్లో శోభాయాత్రను నిర్వహించారు. ఉదయం 10 గంటల సమయంలోపల ఊరేగింపు ముగించుకొని, గ్రామంలోని బొడ్రాయి వద్దకు చేరుకున్నాక లడ్డూ వేలాన్ని ప్రారంభించారు. అనంతరం శోభాయాత్ర కొనసాగుతుందని నిర్వాహక కమిటీ అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి తెలిపారు. గతేడాది లడ్డూను తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి 27లక్షలకు దక్కించుకున్నారు. ప్రప్రథమంగా 1994లో ఏకదంతుడి చేతిలోని లడ్డూను వేలం వేయగా, స్థానిక రైతు కొలను మోహన్‌రెడ్డి 450 రూపాయలకు కైవసం చేసుకున్నారు. సుమారు 17 ఏళ్ల వరకు లడ్డూ కొనుగోలుకు స్థానికులకే అవకాశం లభించగా, తరువాత బయట వ్యక్తులు పాల్గొని దక్కించుకోవడం ప్రారంభమైంది. లడ్డూ ద్వారా వచ్చిన మొత్తంతో ఉత్సవసమితి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ వస్తోంది. ఐతే పెరిగిన డిమాండ్ దృష్ట్యా ఉత్సవ సమితి ఈసారి వేలంలో కొత్త నిబంధన విధించింది. స్థానికులైనా, స్థానికేతరులైనా లడ్డూ వేలంపాటలో పాల్గొనాలంటే గతేడాది వేలంపాట ఎంత వరకు వెళ్లిందో ఆ నగదు మొత్తాన్ని ముందే జమ చేయాలని స్పష్టం చేసింది. ఆ తర్వాతే పోటీదారులను వేలంపాటలో పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. ఈ సారి లడ్డూ రూ.30 లక్షలు పలుకుతుందని అంచనాలతో ఆసక్తి రేపుతోంది.
Last Updated : Sep 17, 2024, 10:57 AM IST