మీడియా ప్రతినిధులపై దాడి చేయడం వైసీపీ రౌడీ మూకల దుర్మార్గం: అచ్చెన్నాయుడు
🎬 Watch Now: Feature Video
Atchannaidu Wants to Punish YCP Leaders Attack Journalists: ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన మీడియాపై సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు(Atchannaidu) ధ్వజమెత్తారు. రాప్తాడులో మీడియా ప్రతినిధులపై వైసీపీ(YCP) రౌడీ మూకల దాడి దుర్మార్గమని మండిపడ్డారు. కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేయడం ఏంటి అని ప్రశ్నించారు. జగన్(Jagan) సభలకు ఆయన కూలి మీడియా, నీలి మీడియా తప్ప మిగతా పత్రికలు రాకూడదా అని ఆయన నిలదీశారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మీడియా(Media) ప్రతినిధులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని మండిపడ్డారు. వైసీపీ పాలన వైఫల్యాలు, నేతల అవినీతిని వెలికి తీసిన వారిపై కక్ష సాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు(Rapthadu)లో చోటుచేసుకున్న ఘటనలో నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అసలు ఏం జరిగిందంటే ఆదివారం అనంతపురం(Anathapur) జిల్లా రాప్తాడు వద్ద జరిగిన సిద్ధం సభ కవరేజీ కోసం వెళ్లిన ఆంధ్రజ్యోతి పత్రిక ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ నేతలు దాడి చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణంలోనే పిడిగుద్దులు కురిపించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించిన వాడివా? అంటూ గుర్తింపుకార్డు చూపించాలని పట్టుబట్టారు. ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఆయన వారి నుంచి తప్పించుకొని పరుగులు తీయగా వైసీపీ జెండా కర్రలతో ముఖం, వీపు మీద రక్తం వచ్చేలా కొట్టారు.